Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 40

Story of Sagara- 3( contd )!

దేవతానాం వచః శ్రుత్వా భగవాన్ వై పితామహః |
ప్రత్యువాచ సుసంత్రస్తాన్ కృతాంత బలమోహితాన్ ||

"అత్యంత కలవరపడుతూ భయభ్రాంతులైన దేవతల వచనములను విని సృష్ఠికర్త అయిన బ్రహ్మ ఇట్లు పలికెను"

బాలకాండ
నలుబదియవ సర్గము
( సగరుని యజ్ఞాశ్వము వెదుకుటలో సగరుని పుత్రులు భస్మమగుట)

విశ్వామిత్రుడు చెప్పసాగెను

' సగరకుమారుల చర్యలతో అత్యంత కలవరపడుతూ భయభ్రాంతులైన ఆ దేవతల వచనములను విని సృష్ఠికర్త అయిన బ్రహ్మ ఇట్లు పలికెను.
"ఈ భూమండలమంతా ఎవరిదో ఆ వాసుదేవుడు కపిల మహర్షి రూపము ధరించి అనుక్షణము ఈ భూమిని మోయుచున్నాడు. ఆ రాజకుమారులు అందరూ ఆయన కోపాగ్నిలో మరణించెదరు. ఈ పృథివి త్రవ్వబడడము , అల్పాయుస్సుగల సగరపుత్రుల నాశనము కూడా పూర్వకాలములో నిర్ణయింపబడినది". సృష్ఠికర్తయొక్క ఆ మాటలను విని ముప్పదిమూడు దేవతలు మళ్ళీ వచ్చిన విధానముగనే వెళ్ళిపోయిరి'.

'అప్పుడు ఆ పృథివిని త్రవ్వుచున్న ఆ మహాబలవంతులగు సగరపుత్రులు నిర్ఘాత పరచునట్టి ధ్వనిని ఎదుర్కొనిరి. పిమ్మట భూమండలము అంతయూ త్రవ్వి ప్రదక్షణముచేసి వచ్చిన ఆ సగర పుత్రులందరూ తండ్రితో ఇట్లుచెప్పిరి."ఈ భూమండలమంతయూ గాలించితిమి. దేవ దానవ రాక్షస , పిశాచ , నాగ , కిన్నర తదితర ప్రాణులను నాశనము చేసితిమి. మేము ఆ యజ్ఞాశ్వమును చూడలేదు. అశ్వమును అపహరించినవానిని కూడా చూడలేదు. మేము ఏమి చేయవలెనో మీరు విచారింపవలసినది. మీకు శుభమగుగాక".

'ఓ రఘునందనా ! వారి మాటలను వినిన ఆ రాజసత్తముడు అగు సగరుడు అదే ఆలోచనగలవాడై పుత్రులతో ఇట్లు పలికెను, "మళ్ళీ త్రవ్వుడు.. మీకు శుభమగుగాక. వసుధాతలమంతయూ త్రవ్వి అశ్వమును అపహరించినవానిని పట్టుకొని కృతార్థులై తిరిగిరండు" అని'. మహాబలవంతులగు సగరునియొక్క అరువది వేల పుత్రులు ఆ తండ్రి మాటవిని రసాతలము వరకూ త్రవ్వుచూ పోయిరి'.

'అలాగ త్రవ్వుచున్న సగరపుత్రులు భూమినంతయును మోయుచున్న ఒక విరూపాక్ష మనబడు మహగజమును చూచిర".

'ఓ రఘునందనా! ఆ విరూపాక్షము అనబడు ఆ మహాగజము , పర్వతములతో వనములతో కూడియున్న ఆ పృథివిని శిరస్సుపై ధరించియుండెను. ఓ రామా ! ఆ మహాగజము ఒక పర్వదినమున విశ్రామము కోసము తన తలను కదిలించినపుడు భూమి కంపించును కూడా .
ఓ రామా! వారు ఆ మహా గజమునకు ప్రదక్షిణము చేసి రసాతలము వఱకు త్రవ్వుచూ పోయిరి. పూర్వ దిశను త్రవ్విన పిమ్మట వారు దక్షిణదిశలో త్రవ్విరి. దక్షిణ దిశలో కూడా ఆ మహాగజమును చూచిరి. భూమి శిరస్సుపై ధరించబడి పర్వత సమానమగు మహాశరీరముగల మహాపద్మము (అనబడు మహాగజము) ను చూచి వారందరూ అశ్చర్యపడిరి'.

'అప్పుడు ఆ అరువదివేల సగరపుత్రులు ఆ గజమునకు ప్రదక్షినముచేసి పశ్చిమ దిశలో త్రవ్వసాగిరి. ఆ మహాబలురు ఆ పశ్చిమదిశలో కూడా పెద్ద పర్వతసమానమైన సౌమనసమనబడు మహాగజమును చూచిరి. వారు దానికి ప్రదక్షణము చేసి కుశలము అడిగి ఉత్తరదిశలో త్రవ్వుటకు ఉపక్రమించిరి. ఓ రఘు శ్రేష్ఠా! ఉత్తరదిశలో కూడా మంచువలె తెల్లగానున్న భద్రమనబడు గజము భద్రముగా భుభారమును మోయుచుండుటను చూచిరి. వారందరూ దానిని స్పృశించి ప్రదక్షిణము కూడా చేసి భూమిని మరల త్రవ్వసాగిరి. పిమ్మట ఆ సగరుని కుమారులు అందరూ రోషముతో ప్రశిద్ధమైన ఈశాన్య దిశలో వెళ్ళి భూమిని త్రవ్విరి'.
'అచట మహాబలవంతులూ , అధిక వేగము కలవారు మహాత్ములూ అగు వారందరూ వాసుదేవునియొక్క అవతారమగు కపిల మహర్షిని గాంచిరి. ఓ రఘునందనా ! ఆ దేవునికి దగ్గరలో నడుచుచున్న అశ్వమును చూచి మిక్కిలి సంతోషము పొందిరి. వారు ఆయనను అశ్వము అపహరించినవానిగా అనుకొని క్రోధముతో అనేక వృక్షములు, శిలలు , నాగళ్ళను పట్టుకొని, "ఆగుము ఆగుము" . "ఓ దుర్మార్గుడా ! మా యజ్ఞసంబంధమైన ఆ అశ్వమును నీవే అపహరించి తీసుకువచ్చితివి. మేము సగరపుత్రులమని తెలిసికొనుము" అని పలుకుచూ వానివేపు పరుగిడిరి'.

'ఓ రఘునందనా ! వారి మాటలను విని అప్పుడు ఆ కపిల మహర్షి కోపముతో "హుంకారము" చేసెను. ఓ కకుత్స్థా ! అప్పుడు ఆ మహాత్ముడగు కపిల ముని చేత సగరకుమారులందరూ భస్మముచేయబడిర'.

|| ఈ విధముగా ఆదికావ్యమైన వాల్మికిచే రచింపబడిన రామాయణములో బాలకాండలో నలభైయవ సర్గ సమాప్తము ||
||ఓమ్ తత్ సత్ ||

తతస్తేనాప్రమేయేణ కపిలేన మహాత్మనా |
భస్మరాశీకృతా స్సర్వే కాకుత్ స్థ సగరాత్మజాః ||

కా|| ఓ కకుత్స్థా ! అప్పుడు ఆ మహాత్ముడగు కపిల ముని చేత సగరకుమారులందరూ భస్మముచేయబడిరి.

||ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||